Geetha Koumudi-1    Chapters   

నాల్గవ కిరణము

గీతా తత్త్వము

'భగవద్గీత' అను శబ్దమునకు (1) 'భగవతాగీతా' అనగా భగవంతునిచే చెప్పబడినది అనిన్ని (2) 'భగవత్‌ తత్త్వం ప్రతిగీతా' అనగా భగవత్‌ తత్త్వమును గురించి చెప్పబడినది అనిన్నీ రెండు అర్థము లుండియున్నవి. దీనిని భట్టి భగవద్గీత అను గ్రంథములో భగవంతుడు భగవతత్త్వమును వ్యక్తము చేసినాడని స్పష్టమగుచున్నది.

భగవద్గీతను ఇప్పటికి సుమారు 5000 సం||రములకు పూర్వము ద్వాపర యుగములో శ్రీకృష్ణపరమాత్మఅర్జునునికి భారతయుద్ధారంభమున చెప్పినట్లు కనబడినప్పటికి 'భగవతాగీతా' అన్నట్లుగా సాక్షాత్తు భగవంతునిచే (కృష్ణావతారము ద్వారా) చెప్పబడినది. కనుకనే కృష్ణగీత అని కాకుండా భగవద్గీతా అని పేరు వచ్చినది అని లోగడ విశదీకరించబడినది.

ఇంకను 'భగవత్తత్త్వం ప్రతిగీతా భగవద్గీతా' అను వ్యుత్పత్యర్థమునుబట్టి భగవద్గీతలో చెప్పబడినది, భగవత్‌ తత్త్వముకనుక, గీతాతత్త్వము భగవత్తత్త్వమే అయియుండవలెను. అట్టి తత్త్వమేమో విచారించుదము. గీతలో ప్రతి అధ్యాయమునకును చివర 'ఇతి (1) శ్రీభవద్గీతాసు (2) ఉపనిషత్సు (3) బ్రహ్మవిద్యాయాం (4) యోగశాస్త్రే (5) కృష్ణార్జున సంవాదే' అని ఉన్నది. దీనిలో వ్యక్తమైన అయిదు భావములలో మధ్యదైన 'బ్రహ్మవిద్య' అనునది విశేష్యముగను మిగతా నాలుగు విశేషణములుగను తీసికొన తగియున్నది. విశేష్యమైన బ్రహ్మవిద్యయే ఈ గీతా తత్త్వము. ఈ బ్రహ్మవిద్య ఎక్కడ లభించును. అంటే దానికి పూర్వము విశేషణముగా వర్ణించబడిన 'ఉపనిషత్సు' అను దానివల్ల ఉపనిషత్తులలో దొరకునని చెప్పబడినది. ఆ ఉపనిషత్తులు పురుషకృతములు గాక అపౌరుషేయములు అని విశదీకరించుటకుగాను 'భగవద్గీతాసు' అను మొదటి విశేషణము వాడబడినది. భగవద్గీత' అనగా 'భగవతాగీతా' అని చెప్పబడినదానికి భగవంతునిచేత వ్యక్తము చేయబడినది అని అర్థమే కాని భగవంతుడిచేత చెప్పబడినదని కాదు. 'న కశ్చి ద్వేద కర్తాచ' 'అనాది నిదనా నిత్యావాగు త్సృష్టా స్వయంభువా' 'ఈశ్వర స్తస్సవ్యం జకః' యస్య నిశ్వ సితం వేదాః' ఇత్యాది ప్రమాణములు వేదములు పరమేశ్వరుని ఉచ్ఛ్వాసములనియు, వేదములు ఆదిలేనివి, నిత్యములు అనియు, వేదములకు కర్త లేడనియు, నిశ్వాసకువలె పరమేశ్వరుడు వారికి అభివ్యంజకుడు మాత్రమే అనియు , స్పష్టము చేయుచున్నవి. కనుక 'భగవతా గీతా' అనగా అర్థము భగవంతునిచేత వ్యక్తము చేయబడినదే కాని చెప్పబడినది కాదని స్పష్టమగుచున్నది. ఇట్టి బ్రహ్మవిద్యను అభ్యసింపవలసిన విధానము 'యోగశాస్త్రే' అను నాల్గవ విశేషణమువలనను, 5 వ విశేషణము అయిన 'శ్రీకృష్ణార్జున సంవాదే' అనుదానివల్లను స్పష్టము చేయబడినది. అది ఎట్లు అనగా యోగము అనగా సాధనమని అర్థము. గీతలోని పదునెనిమిది అధ్యాయములలోను పదునెనిమిది సాధనములు తెలియచేయబడునవి. కనుక గీతాతత్త్వమైన బ్రహ్మవిద్యను ఆ పదునెనిమిది సాధనములద్వారా అభ్యసింపవలయును అని గ్రహించివలెను. మరియు 'కృష్ణార్జునసంవాదే' అను విశేషణమువలన కృష్ణుని అర్జునుడు గురువుగా స్వీకరించిన తరువాతనే కృష్ణుడు గీతను చెప్పినాడు గనుక యీ గీతాతత్త్వమైన బ్రహ్మవిద్య గురుముఖతః. గురు శుశ్రూషద్వారా తెలిసికొనదగినదే కాని ఎవరికివారు స్వతంత్రించి పుస్తకములద్వారా నేర్చుకొనతగినదికాదని తెలియుచున్నది. పై విమర్శవలన గీతాతత్త్వమైన భగవత్‌ తత్త్వము బ్రహ్మవిద్యయే అని తేలినది.

బ్రహ్మవిద్య అనగా జీవబ్రహ్మైక్యమును బోధచేయు విద్య అని ఉపనిషత్తులవల్ల స్పష్టమగుచుండుటచేత, గీతాతత్త్వము అంటే జీవబ్రహ్మైక్యమును చెప్పు బ్రహ్మవిద్యయే అని తేలుచున్నది.

ఇంకను గీతలోని 18 అధ్యాయములను 3 షట్కములుగా విభాగించినపుడు, మొదటి షట్కము 'త్వం' పదార్థమైన జీవస్వరూపమును, 2వ షట్కము 'తత్‌' పదార్థమైన ఈశ్వరస్వరూపమును, 3వ షట్కము 'అసి' పదార్థమైన జీవ బ్రహ్మైక్యమును తెలియ జేయుచుండుటచేత 'తత్త్వమసి' అను మహావాక్యమునకు గీత లక్ష్యభూతమైన గ్రంథమని తెలియుచున్నది. 'తత్త్వమసి' అను మహావాక్యము జీవ బ్రహ్మైక్యమును తెలియ జేయుచున్నది గదా కనుక గీతా తత్త్వము జీవబ్రహ్మైక్యమును బోధించు అద్వైతజ్ఞానమేఅని విశదమగుచున్నది. మరియు మొదటి షట్కములో కర్మయోగము, 2వ షట్కములో భక్తియోగము, 3వ షట్కములో జ్ఞానయోగము, బోధింపబడియుండుటచేత మొదటి షట్కములోని "త్వం" పదవాచ్యుడగు జీవుడు ఆషట్కములో చెప్పబడిన కర్మయోగమును అనుసరించిన యెడల 2వ షట్కములో వర్ణింపబడిన "తత్‌" పదవాచ్యుడగు ఈశ్వరుని ఆ షట్కములో చెప్పబడి ప్రకారము భక్తి చేయుటకు అర్హుడై భక్తిచేయగా, భగవదనుగ్రహమునకు పాత్రుడు అయి, 3వ షట్కములో చెప్పబడిన జ్ఞానయోగము నవలంబించి "అసి" పదార్థమగు జీవబ్రహ్మైక్యమును ఆనుభవములోనికి తెచ్చుకొని జీవన్ముక్తుడగును. దీనివలన కూడా గీతాతత్త్వము అద్వైతజ్ఞానమనియు అట్టి అద్వైతజ్ఞానమునకు కర్మయోగము, భక్తియోగము సాధనములనియు తెలియుచున్నది.

ఇంకను గీతాతత్త్వము ఏమి అను విషయమును మీమాంసా శాస్త్రములో చెప్పబడిన షడ్విధలింగములతో విమర్శించి చూచినను గీతాతత్తము అద్వైతమే అని స్పష్టమగును. ఆ షడ్విధలింగములు ఏవి అనగా (1) ఉపక్రమోప సంహారములు (2) అభ్యాస (3) అపూర్వత (4) ఫలము (5) అర్థవాద (6) ఉపపత్తి.

1. ఉపక్రమోప సంహారములు:- కృష్ణుని బోధ 2వ అధ్యాయము 11 వ శ్లోకము 'అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చభాషసే గతానూన గతా సూంశ్చనాను శోచంతిపండితాః, అను శ్లోకముతో ఆరంభ##మై 18 వ అధ్యాయము 66 వ శ్లోకము 'సర్వధర్మాన్‌ పరిత్యజ్యమా మేకం శరణం వ్రజ! అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష

ష్యామి మాశుచః || అను శ్లోకముతో ఉపసంహారము చేయబడినది. ఉపక్రమములో ఆత్మజ్ఞాని దుఃఖించడు అని చెప్పబడి ఉపసంహారములో కనుక నీవు దుఃఖించకుము అని చెప్పబడి నందువల్ల దుఃఖనివారణ ఆత్మజ్ఞానమువల్లనే కల్గును అని స్పష్టమగుటచేత, యీ ఉపక్రమోప సంహారములు గీతాతత్త్వము ఆత్మజ్ఞానమే అని సూచించుచున్నవి మరియు కృష్ణుడు గీతనంతయు బోధచేసి, చివరకు 18వ అధ్యాయము 63 వ శ్లోకములో 'ఇతితే జ్ఞాన మాఖ్యాతం, గుహ్యాద్గు హ్యతరం మయా' అని చెప్పుటవల్ల కృష్ణుడు చెప్పిన గీతాతత్త్వము జ్ఞానబోధయే అని సాక్షాత్తు కృష్ణుని మాటలవల్లనే స్పష్టమగుచున్నది. ఇంకను కృష్ణుడు గీతాబోధను ముగించిన తరువాత 18వ అధ్యాయం 72వ శ్లోకములో 'కచ్చిదజ్ఞాన సంమోహః ప్రణష్టన్తే ధనంజయ' అనగా నీకు అజ్ఞానమువలన పుట్టిన సంమోహము (యీనా బోధవల్ల) పోయినదా అని అడుగగా దీనికి జవాబుగా అర్జునుడు 'నష్టోమోహఃస్మృతిర్ల బ్థా త్వత్ర్పసాదాన్మయాచ్యుత' అనగా మీ అనుగ్రహమువల్ల నాకు జ్ఞానము కలిగినది. మోహము పోయినది అని చెప్పినాడు. అర్జునుకి కలిగిన ఆ అజ్ఞానమును నశింపజేయునది జ్ఞానమేకాని ఇంకొకటి కానేరదు కనుక గీతాతత్త్వము జ్ఞానబోధయే అని అర్జునుని వాక్యములవలననూ కూడా స్పష్టమగుచున్నది. ఇట్లు కృష్ణుని యొక్కయు అర్జునునియొక్కయు వాక్యములవలననే గీతా తత్త్వము జ్ఞానబోధయని స్పష్టమగుచున్నది.

మరియు 4వ అధ్యాయము 33 వశ్లోకములో 'సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే' అనగా కర్మయంతయు జ్ఞానములోనే పరిసమాప్తి చెందును. అని వర్ణించుటవల్ల కర్మము జ్ఞానమునకు సాధనమని స్పష్టపడుచున్నందున గీతా తత్త్వము కర్మబోధ కానేరదు. ఇంకను 11 వఅధ్యాయం 54 శ్లోకములోను, 18వ అధ్యాయమం 55 వశ్లోకములోనున్ను 'భక్త్యా' అను తృతీయావిభక్తివలన భక్తికూడా జ్ఞానము నకు సాధనమని స్పష్టముగా చెప్పబడినందున గీతాతత్త్వము భక్తియు కానేరదు.

(2) అభ్యాస:- అభ్యాస అనగా పలుసార్లు చెప్పుట. గీతలలో 2, 4, 7, 13, 14, 15, 18 అధ్యాయములలో ప్రధానముగాను, మిగతా అధ్యాయములలో అక్కడక్కడయును, శోకనాశనమగు జ్ఞానము పలుసార్లు స్తుతింపబడి యున్నది. ఇట్టి అభ్యాసలింగమువలనకూడా గీతాతత్త్వము జ్ఞానమే అని విశదమగుచున్నది.

(3) అపూర్వత:- అపూర్వత అనగా మనకు యింకొకవిధముగా తెలియుటకు వీలులేని విషయబోధ. అట్టిది జీవబ్రహ్మైక్యబోధయే. 13 వ అధ్యాయమ 2వ శ్లోకములో 'క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత' అనియు 7వ అధ్యాయం 18వ శ్లోకములో 'జ్ఞానీత్వాత్త్మెవ మేమతం' అనియు స్పష్టముగాను, మిగతాచోట్ల ఆర్థికముగాను, జీవబ్రహ్మైక్యము చెప్పబడుటచేత, అట్టి జీవబ్రహ్మైక్యజ్ఞానబోధయే గీతాతత్త్వము అని యీ అపూర్వత అనులింగము వలనున్న స్పష్టమగుచున్నది.

(4) ఫలం :- ఫలం మోక్షరూపం. భగవద్గీతలో అనేకచోట్ల మోక్షఫలం 'శాంతి మాప్నోతి నైష్ఠికీం' 'నశాంతి మాధిగచ్ఛతి' 'సశాంతి మాప్నోతి' మున్నగు ప్రమాణములవల్ల శాంతియే అని స్పష్టమగుచున్నది. అంతే కాని వైకుంఠాది లోకాంతరగమనము కాదనిన్నీ తేలుచున్నది. ఇంకను ఉపనిషత్తులలోగూడా మోక్షఫలము శాంతిరూపకముగాను అభయరూపకముగాను వర్ణింపబడినదే గాని, లోకాంతరగమనముగా వర్ణింపబడలేదు. అట్టి ఫలము జ్ఞానమువల్లనే లభ్యమగును. కాని కర్మవల్ల కాని భక్తివల్ల కాని రానేరదు. కర్త భక్తుల ఫలము లోకాంతరప్రాప్తియే. అది ఈ గీతలో వర్ణింపబడక, జ్ఞానముయొక్క ఫలమయిన శాంతి వర్ణింపబడుటచేత, గీతాతత్త్వముజ్ఞానమే అని యీ ఫలలింగమువలనకూడా స్పష్టమగుచున్నది.

(5) అర్థవాద :- అర్థవాదమనగా స్తుతిప్రథానమైన వాక్యవిశేషము. 'హత్వాపి స ఇమాన్‌ లోకాన్‌ న హంతి, ననిబధ్యతే' (18-17) 'సర్వధా వర్తమానో పి న సభూయో భిజాయతే' (13-24) 'అపిచేదసిపాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః సర్వంజ్ఞానప్ల వేనైవ వృజినం సంతరిష్యసి' (4-36) మున్నగు వాక్యములు ఆత్మజ్ఞానముగల జ్ఞానిని ఎంతగా స్తుతించుచున్నవనగా, అట్టి జ్ఞాని లోకములన్నింటిని చంపువాడైనను, ఎట్టి దురాచారములు కలవాడు అయినను, ఎట్టి ఘోరపాపములు చేసిన వారలలో అధమాధమ పాపి అయినను, వానిని ఇవి ఏవియు బాధింపవు. వాడు జ్ఞానము అను తెప్పచేత అన్నింటిని దాటి తిరిగి పుట్టడు. వాడు ముక్తుడే అని జ్ఞానముయొక్క స్తుతిని ప్రదర్శించుటచేత యీ అర్థవాదలింగముకూడా జ్ఞానమే గీతాతత్త్వము అని స్పష్టపర్చు చున్నది.

(6) ఉపపత్తి :- ఉపపత్తి అనగా యుక్తివిచారణ మీద సరిపోవుట. గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకములో 'యద్జత్వా నేహ భూయోన్యత్‌ జ్ఞాతవ్య మవశిష్య తే' అను ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞయును, 5వ అధ్యాయము లోను ఇతర అధ్యాయములలోను చెప్పబడిన జీవన్ముక్తియును అద్వైత జ్ఞానమునకే ఉపపత్తి లింగములుగా సరిపోవును కాని ద్వైత విశిష్టాద్వైత భక్తి సిద్ధాంతములకు యుక్తి మీద కుదరవు. ఆ సిద్ధాంతముల ప్రకారము జీవన్ముక్తి యే లేదు. చనిపోయిన తరువాత నే ముక్తి. ఇంకను యిట్టి అద్వైతసిద్ధాంతమునకే కుదురునట్టియు, తద్భిన్నసిద్ధాంతములకు యుక్తిమీద సరిపోనట్టియు, అనేక భావములుగల శ్లోకములు గీతలో ఉండియున్నవి. ఇట్లు ఉపపత్తిలింగముకూడ గీతాతత్త్వము అద్వైతజ్ఞానమే అని సూచించుచున్నది.

ఇట్లు షడ్విధలింగతాత్పర్యములవల్లను గీతాతత్త్వము అద్వైత జ్ఞానబోధయే అని స్పష్టమగుచున్నది. ఇట్టి అద్వైతజ్ఞానమునకు నిష్కామకర్మయోగమును, భక్తి యోగమున్ను సాధనములు. 'భగవద్గీతా' అను శబ్దములో 'గీతా' అను శబ్దము ఆకారాంత స్త్రీ లింగముగా వర్ణింపబడినది. ఇట్లు ఎందుకు వర్ణింపబడిన దనగా, ఉపనిషత్తులలోని జ్ఞానబోధయే ఈ గీతాతత్త్వము అగుట ఉపనిషత్‌' అను శబ్దము స్త్రీ లింగ మగుటచేతను, చేతను, గీతకు 'ఉపనిషత్‌' సాదృశ్యమును తెల్పుటకై 'గీతా' అని స్త్రీలింగము ప్రయోగించబడినది.

Geetha Koumudi-1    Chapters